Hyderabad TSPSC Recruitment : తెలంగాణ:రాష్ట్రంలో కొలువుల జాతర ముమ్మరంగా కొనసాగుతున్నది. విద్యుత్‌శాఖలో ఒకేసారి భారీస్థాయిలో 13,357 పోస్టుల భర్తీకి మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మరుసటిరోజే మరిన్ని శాఖలలో మరిన్ని పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. అన్నింటికి మించి నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీకి పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 8792 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్థికశాఖ తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 540 పోస్టుల భర్తీకి బుధవారం పచ్చజెండా ఊపింది. 52 వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి టీఎస్పీఎస్సీకి అనుమతినిస్తూ పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేశ్‌చందా ఉత్తర్వులిచ్చారు. కాంట్రాక్ట్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పోస్టుల్లో 300 మందిని నియమించుకునేందుకు కూడా అనుమతి మంజూరు చేశారు. దివ్యాంగుల శాఖలో 224 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని శాఖ డైరెక్టర్ బీ శైలజ చెప్పారు. దీనికితోడు ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు ఫారెస్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించాలన్న ఆటవీశాఖ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1,305 బీట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఖాళీల భర్తీకి అధికారిక ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.